తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. మేడారం మహాజాతర కోసం భారీస్థాయిలో నిధులు !
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరలో దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వచ్చే ఏడాది జనవరి చివర్లో కూడా ఈ జాతర ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ కోసం భారీస్థాయిలో నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ రూ.150 కోట్లు మంజూరు చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నిధులను జాతర ఏర్పాట్లు, మౌలిక వసతులు, శాశ్వత నిర్మాణాల పనులకు వినియోగించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ జాతరలో శుభ్రమైన త్రాగునీరు, విద్యుత్, రహదారులు, శానిటేషన్, పార్కింగ్, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు వంటి సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఇక ఇప్పటికే జాతరకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సారి గత సారికంటే మరింత విస్తృతంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా, అత్యవసర వైద్య కేంద్రాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్స్, ఉచిత బస్సు సదుపాయం, తాత్కాలిక వసతి గృహాలు వంటి అదనపు సౌకర్యాలు సైతం కల్పించనున్నారు.
మంత్రి సీతక్క స్పందన..
ఈసారి మునుపెన్నడూ లేని రీతిలో నిధులు కేటాయించడం పట్ల మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. మేడారం జాతర ప్రతిష్టను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచే దిశగా ప్రభుత్వం చూపుతున్న కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
కాగా ఈ క్రమంలోనే పూజారుల సంఘం జాతర అధికారిక తేదీలు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర వైభవంగా జరగనుంది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోనున్నారు. జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
మూడో రోజైన జనవరి 30న సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు విపరీతంగా తరలి వచ్చి బంగారం, వెండి, జుట్టు, కోడిపుంజులు, తేనె, చెల్లింపు డబ్బులు వంటి విభిన్న రకాల మొక్కులు సమర్పిస్తారు. ఈ సమయంలో జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, గిరిజన సంస్కృతి రంగులతో నిండిపోతుంది.
సమ్మక్క-సారలమ్మ జాతరను "దక్షిణ భారత కుంభమేళా" అని కూడా పిలుస్తారు. గిరిజన సమాజం ఆరాధించే ఈ జాతరలో గిరిజన సంప్రదాయాలు, వారి పూజా విధానాలు, సంస్కృతి ప్రతిబింబిస్తాయి. కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, ఇది గిరిజన గౌరవానికి ప్రతీకగా అభివర్ణిస్తారు.












Click it and Unblock the Notifications