కె.రాఘవేంద్రరావు - దగ్గుబాటి సురేష్‌బాబుకు, తెలంగాణ ప్రభుత్వం మధ్య యుద్ధం?
దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ప్రభుత్వ స్థలాన్ని వీరు అక్రమంగా కొనుగోలు చేశారంటూ తెలంగాణ ప్రభుత్వం కోర్టులో వాదిస్తోంది. కొన్నాళ్లుగా స్థలానికి సంబంధించి ఈ రెండు ''పార్టీ'' లమధ్య కోర్టులో వాద ప్రతివాదాలు హోరాహోరీగా సాగుతున్నాయి. సింగిల్ బెంచ్‌లో రాఘవేంద్రరావుకు, రామానాయుడి కుటుంబ సభ్యులకు అనుకూలంగా తీర్పు వచ్చినా తెలంగాణ సర్కారు ఏమాత్రం తగ్గలేదు. హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 26.16 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తుల నుంచి వీరు కొనుగోలు చేశారు. ఈ భూమి ప్రభుత్వానిదంటూ తెలంగాణ సర్కారు కోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ రాఘవేంద్రరావుకు, రామానాయుడి కుటుంబ సభ్యులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ భూమిలో కొంత భాగం మల్లయ్య అనే వ్యక్తికి ప్రభుత్వం అసైన్ చేసిందని, అతను తీసుకోకపోవడంతో తిరిగి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని సర్కారు కోర్టుకు వెల్లడించింది.

మాజీ సైనికులకు 5 ఎకరాల చొప్పున 1963లో భూములు ఇవ్వడం ప్రారంభమైందని, అయితే అంతకు రెండు సంవత్సరాల ముందే 1961లోనే నరసింహులు నాయక్ అనే వ్యక్తికి ప్రభుత్వం భూమి ఇచ్చినట్లుగా నకిలీ పట్టాలు సృష్టించినట్లు గా స్థలం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. సంతకాలు కూడా తేడా ఉన్నాయని, అప్పటి ఎమ్మార్వో సంతకానికి, దీనికి పోలిక లేదని, సంతకం ఫోర్జరీ జరిగినట్లు ఫోరెన్సిక్ శాఖ నివేదిక ఇచ్చినట్లు సర్కారు కోర్టుకు తెలిపింది. 15 సంవత్సరాల తర్వాత సేత్వారీని రద్దుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ సింగిల్ జడ్జి సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారని, అయితే ఆ తీర్పు ఈ కేసుకు వర్తించదని వెల్లడించింది. భూమిపై హక్కులు లేని వ్యక్తుల నుంచి కె.రాఘవేంద్రరావు, దగ్గుబాటి రామానాయుడి కుటుంబ సభ్యులు దీన్ని కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరింది. ప్రభుత్వ వాదన దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యులకు, రాఘవేంద్రరావుకు షాకిచ్చేదిగా రాజకీయ, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications