24 లక్షల తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి: ఇద్దరు అధికారులపై వేటు
తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో దొర్లిన తప్పులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి డైరెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని తొలగించింది. పాఠ్యపుస్తక ముద్రణ సేవల డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసాచారిని, మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్‌గా మార్చగా, ఎస్‌సీఈఆర్‌టీ అదనపు డైరెక్టర్ రాధారెడ్డిని ఆ విధుల నుంచి తొలగిస్తూ, సమగ్ర శిక్షా అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అపాయింట్ చేసింది.
ఇక, వీరి స్థానాల్లో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు, టీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రమణకుమార్‌కి ముద్రణ సేవల డైరెక్టర్‌గా బాధ్యతలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు. పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా నిలిపివేశారు.

మొత్తం 24 లక్షల పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. ఏళ్ల క్రితం నాటి ముందుమాటలో మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. బుధవారం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలో ముందుబాటలోని తప్పులను చాలా చోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, తొలుత ఆ పేజీని చించేయాలని ఆదేశించిన అధికారులు.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ పేజీని తొలగిస్తే దాని వెనుకున్న వందేమాతం, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లేకుండా పోతాయి. దీంతో మరిన్ని విమర్శలు వస్తాయని గ్రహించారు. ఈ క్రమంలోనే పిల్లలకిచ్చిన, ఇవ్వని పుస్తకాలన్నీ వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. వాటిని మండల వనరుల కేంద్రాలకు తరలించాలని సూచించారు. అయితే, ఈ పేజీ మొత్తం కనిపించకుండా స్టిక్కర్ వేసి అందజేయనున్నారు. మరోవైపు, తెలుగు వర్క్ బుక్స్ ను కూడా వెనక్కి తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications