మాజీ వీఆర్ఓ, వీఆర్ఏలకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ వీఆర్ఓ(విలేజ్ రెవెన్యూ అధికారి), వీఆర్ఏలకు శుభవార్త చెప్పింది. మాజీ వీఆర్ఓ, విఆర్ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు, అర్హతలు ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో ఇచ్చింది.
డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలకు జీపీవో (గ్రామ పాలన అధికారులు)గా అవకాశం కల్పించనుంది. ఇంటర్ తోపాటు ఐదేళ్లు వీఆర్ఓ లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్నవారు ఇందుకు అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

హైదరాబాద్‌లో లింక్ రోడ్లపై సీఎంరేవంత్ సమీక్ష
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ ( HMDA) పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HRDCL) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు.
వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
అనుసంధాన రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలు, విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసి వచ్చేలా ఉండాలని, ఈ క్రమంలో అదనపు భూసేకరణకు కొంత అధిక వ్యయమైనా వెనుకాడవద్దని చెప్పారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications