హైదరాబాద్ ర్యాడిసన్ బ్లూలో డ్రగ్స్ పట్టుబడ్డ వేళ.. తెలంగాణ నార్కొటిక్స్‌కు కొత్త ఎస్పీ
Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఎక్సైజ్ విభాగం సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది.
దీనికి కొనసాగింపుగా.. మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ బదిలీ అయ్యారు. ఆయన.. తెలంగాణ పోలీస్ ఆర్గనైజేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా అపాయింట్ అయ్యారు.

హైదరాబాద్ సిటీ క్రైమ్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అదనపు కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హైదరాబాద్ మల్టీ జోన్ 1 ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమించింది. ప్రస్తుతం అక్కడ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న జీ సుధీర్ బాబును రిలీవ్ చేసింది.
హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ చంద్ర పవార్ బదిలీ అయ్యారు. తెలంగాణ స్టేట్ నార్కొటిక్స్ బ్యురో ఎస్పీగా ఆయన అపాయింట్ అయ్యారు. డ్రగ్స్ నిర్మూలనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించడం, ర్యాడిసన్ బ్లూలో డ్రగ్స్ సేవిస్తూ కొందరు పట్టుబడటం, అదే పార్టీలో మాదకద్రవ్యాలు భారీ స్థాయిలో దొరకడం.. వంటి పరిస్థితుల్లో నార్కొటిక్స్ విభాగానికి కొత్త ఎస్పీ అపాయింట్ కావడం చర్చనీయాంశమైంది.
ఇదివరకు మొత్తం 12 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. మల్టీ జోన్-1 ఐజీపీగా నియమించారు. అక్కడున్న తరుణ్ జోషిని రాచకొండ పోలీస్ కమిషనర్‌గా అపాయింట్ చేశారు.
ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఎం శ్రీనివాసులు.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఈ స్థానానికి జోగుళాంబ గద్వాల జిల్లా జోన్ 2 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్‌ను నియమించారు. ఆ జీవోను రద్దు చేసింది ప్రభుత్వం. చౌహాన్‌ను ఇప్పుడున్న స్థానంలో కొనసాగించారు.












Click it and Unblock the Notifications