మీ ఆతిథ్యం అమోఘం: దేవసేనకు గవర్నర్ తమిళిసై ప్రశంసలు
హైదరాబాద్/పెద్దపల్లి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించారు. పెద్దపల్లి జిల్లాను సందర్శించిన ఆమె ప్రాతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పరిశీలించారు. ఈ పర్యటనలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన గవర్నర్ వెంట ఉండి ఈ ప్రాంత విశిష్టతలను తెలపడంతోపాటు మంచి ఆతిథ్యాన్ని అందించారు.

దేవసేనకు ప్రశంసలు
ఈ నేపథ్యంలో కలెక్టర్ దేవసేన ఆతిథ్యానికి ముగ్ధులైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెను ప్రశంసించారు. కలెక్టర్ దేవసేన ఆదరించిన తీరును మెచ్చిన తమిళసై ఆమెకు అభినందనలు తెలియజేస్తూ లేఖ రాశారు. ఇందులో జిల్లా అధికారులను కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మీ ఆతిథ్యంఎంతగానో ఆకట్టుకుంది
‘నా పర్యటన సందర్భంగా మీరు, మీ జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మీ ఆతిథ్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పర్యటన మొత్తం చాలా సంతోషంగా సాగింది' అని కలెక్టర్ దేవసేనకు రాసిన లేఖలో గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

శక్తి కార్యక్రమం అభినందనీయం
పాఠశాల విద్యార్థినుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు వారిలో ఆత్మస్థైర్యం, స్వీయ రక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆ లేఖలో అభినందించారు. అంతేగాకుండా ఇటీవల ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింంపుతున్నారన్నారు. వారిని వారు రక్షించుకునే విధంగా ‘శక్తి' అనే కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 6-10వ తరగతి బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనివ్వడం చాలా మంచి నిర్ణయమని కొనియాడారు.

ప్రతి ఒక్కరికీ పేరు పేరున..
మహిళలు స్వశక్తితో ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న పరిశ్రమ గురించి కూడా ఈ లేఖలో గవర్నర్ ప్రస్తావించారు. బసంత్‌నగర్ మహిళలు తయారు చేస్తున్న బట్ట బ్యాగులు, సబలల న్యాప్‌కిన్స్ తయారీ అద్భుతంగా ఉందన్నారు. అంతేగాకుండా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నందిమేడారం, కాళేశ్వరం ప్యాకేజీ-6ను సందర్శించడం పట్ల గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు. తన పర్యటనకు సహకరించిన కలెక్టర్ దేవసేన, జిల్లా అధికారులు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.












Click it and Unblock the Notifications