తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. యూజీసీ ఏరియర్స్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కాపీలను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు వైద్య సిబ్బందికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మరోవైపు, వైద్యారోగ్య శాఖ పరిధిలో భారీగా నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. టీఎస్ పీఎస్సీ ద్వారా 1479 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. పీజీ డాక్టర్లను డీహెచ్, టీవీవీపీ నుంచి డీఎంఈ వైపు తీసుకున్నామన్నారు. ఇలా ఐదేళ్లలో మొత్తం 688 మందిని తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
761 వైద్యులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 545 మంది వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లు, 31 మందికి అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చామని మంత్రి హరీశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 26 మెడికల్ కాలేజీలు వచ్చాయని, కొత్త పోస్టులు క్రియేట్ అయ్యాయని తెలిపారు. దీంతో త్వరగా ప్రమోషన్లు పొందుతున్నారని చెప్పారు.
ఒకప్పుడు 20 ఏళ్ల సర్వీస్ తర్వాతనే ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు వచ్చేవని.. కానీ, ఇప్పుడు ఏడేళ్ల సర్వీసు నిండిన వెంటనే ప్రొఫెసర్ పదోన్నతి కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఏరియర్స్ విడుదలతోపాటు బదిలీల ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వైద్య సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications