సమాచారం ఇస్తే రూ.2 లక్షలు క్యాష్ రివార్డ్ ప్రకటించిన తెలంగాణ: ఫోన్ చేయాల్సిన నంబర్
Revanth Reddy: తెలంగాణలో రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. రాజకీయంగా దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ చర్యలకు దిగింది. మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెట్టింది.
ఇందులో భాగంగా- గంజాయి సాగు, అక్రమ రవాణా గురించి సమాచారం ఇచ్చిన వారికి క్యాష్ రివార్డును ప్రకటించింది. దీనిపై ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ను ప్రారంభించబోతోంది. మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా ప్రభుత్వం. దీన్ని అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకుంటోంది.

రాష్ట్రంలో ఎక్కడైనా గానీ గంజాయిని సేవిస్తున్నట్లు, దాన్ని అక్రమంగా రవాణా చేస్తోన్నట్లు సమాచారం అందితే వెంటనే తమకు తెలియజేయాలని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అధికారులు విజ్ఞప్తి చేశారు. నంబర్ 871267111కు ఫోన్ చేయడం లేదా [email protected] అనే అడ్రస్‌కు ఇ-మెయిల్ చేయాలని కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. 100 కేజీల కంటే ఎక్కువ గంజాయి గురించి సమాచారం అందించిన వారికి రెండు లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని చెప్పారు.
తెలంగాణలో- ప్రత్యేకించి హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోందంటూ భారత్ రాష్ట్ర సమితికి చెందిన కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కేపీ వివేకానంద్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీన్ని అరికట్టడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ యువత గంజాయి మత్తులో మునిగితేలుతోందని, కుటుంబాలు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని వివేకానంద అన్నారు. గతంలో తమ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపిందని, దీన్ని అరికట్టడానికి ప్రత్యేక విభాగాలను సైతం ఏర్పాటు చేసిందని గుర్తు చెప్పారు.
పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ విక్రయించేంతటి స్థాయికి గంజాయి వ్యాపారం సాగుతోందని వివేకానంద ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో యథేచ్ఛగా గంజాయిని సేవిస్తోన్నారని, అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications