రైతు భరోసా పెండింగ్ నిధుల జమ పై కీలక ప్రకటన..!!
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పై కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా నిధులను వరుసగా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. రైతులకు ఉన్న భూమి ఆధారంగా విడతల వారీగా నిధులను జమ చేస్తున్నారు. అందులో భాగంగా 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లను మూడో విడతగా విడుదల చేసింది. దీని ద్వారా 6.39 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సారి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ తొలి విడతగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను నేరుగా జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు. కాగా.. ఈ రోజు మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

మూడో విడత నిధులు ఖాతాల్లో జమ
కాగా, ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పటివరకు మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని మంత్రి తుమ్మల అన్నారు. రైతుల కోసం ప్రతి నెల సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.4 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం రూ.80 వేల కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి వివరించారు.













Click it and Unblock the Notifications