ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో కీలక మార్పులు- ఇక చెల్లింపు ఇలా..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయంబర్స్ మెంట్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ఫీజుల మొత్తాన్ని కళాశాలలకు కాకుండా, విద్యార్థులకే ప్రభుత్వం చెల్లిస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు చేస్తూ బుధవారం కొత్త ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు కానుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి స్కాలర్ షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నగదును విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సవరణ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులకు మంజూరు చేసే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేరుగా విద్యార్థుల ఖతాల్లోకి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. విద్యార్థుల ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజు దుర్వినియోగం కాకుండా ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా నెంబర్ తో పాటుగా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులు పరిశీలించాలి. ఇంటర్మీడియట్ బోర్డు, ఉపాధి కల్పన అధికారి, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, కళాశాలలు, యూనివర్శిటీలు, సంస్థలు నోడల్ ఆఫీసర్ ను నియమించాలి.

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
అదే విధంగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సంక్షేమ శాఖల అధికారులతో కలిసి విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నట్లు నమోదు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక.. రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్ షిప్ నిధుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని... అందుకే స్కాలర్ షిప్ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి.. అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో నిధులు అందేలా చూస్తామని స్పష్టం చేసారు.
అయితే, ఇప్పటికే పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా నిర్ణయాల పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications