కంచ గచ్చిబౌలిలో అతిపెద్ద ఎకో పార్క్?
HCU: హైదరాబాద్‌లో అతిపెద్ద ఎకో పార్క్ రాబోతోందా? కంచ గచ్చిబౌలిలో దీన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందా?, కంచ గచ్చిబౌలి పరిధిలో 400 ఎకరాలను వేలం వేయాలంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
దీని స్థానంలో అతిపెద్ద ఎకో పార్క్‌ను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలో ఉన్న భూమితో సహా మొత్తం 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కాబోతోందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్క్‌లల్లో ఒకటిగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతతో సహా అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు రెండు రోజుల కిందటే ఆదేశాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలో ఉన్న భూమిని వేలం వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై అటు కేంద్రం కూడా వివరణ కోరిన విషయం తెలిసిందే.
ఫలితంగా వేలానికి బదులుగా- ఎకో పార్క్ నిర్మాణ ప్రతిపాదనలను తెర మీదికి తీసుకొచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలోని కొత్తగా నిర్మితం అయ్యే ఫ్యూచర్ సిటీకి సెంట్రల్ యూనివర్శిటీని తరలించనున్నారు. అక్కడ 100 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ప్రభుత్వం సమకూర్చుతుందని తెలుస్తోంది.
ఈ ఎకో పార్క్‌లో ఎత్తైన వ్యూ టవర్స్, వాక్ వే, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు, బటర్‌ఫ్లై పార్క్, టార్టాయిస్ పార్క్, ఓపెన్ జిమ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, ఇక్కడి నేల స్వరూపాన్ని అధ్యయనం చేయడానికి, విభిన్న జాతుల చెట్లను నాటడానికి అధికారులు మైక్రో ఎన్విరాన్‌మెంట్ డిజైన్‌ను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచం నలుమూలల నుండి నిపుణులను ఆహ్వానించాలని భావిస్తోన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ నిపుణులతో సంప్రదింపులు జరుపుతామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి ముందు నిపుణుల కమిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి పార్కులను అధ్యయనం చేస్తామని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా, పారదర్శకతతో కార్యాచరణలోకి పెట్టడానికి ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావస్తోంది. ఇందులో- పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థి ప్రతినిధులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఎకో పార్క్ డెవలప్మెంట్‌ను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.












Click it and Unblock the Notifications