రేవంత్ రెడ్డి ప్లాన్: విజయవాడ వరకూ కారిడార్..!!
Revanth Reddy: తెలంగాణలో రోడ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ప్రతిపాదనలను యుద్ధ ప్రాతిపదికన ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకున్నారు. భూ సేకరణ విషయంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లించే విషయంలో జాప్యం చేయకూడదని ఆదేశించారు.
ఈ ఉదయం సచివాలయంలో జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలు, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రహదారులు నిర్మాణంలో ఉన్న పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు పరిహారాన్ని చెల్లించే విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. శాశ్వతంగా భూములు కోల్పోవాల్సి వస్తుందని, వారికి పరిహార మొత్తం కూడా గరిష్టస్థాయిలో ఉండేలా చూడాలని అన్నారు.
జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న రోడ్డు ప్రాజెక్టులపైనా ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికలను అందజేయాలని అన్నారు. కొత్త ప్రాజెక్టుల కోసం అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని చెప్పారు.
తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల- వరంగల్- ఖమ్మం- విజయవాడ కారిడార్ భూ సేకరణ పురోగతిపై అధికారులకు రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా తెలంగాణ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిన అన్ని రాష్ట్రాలతోనూ అనుసంధానం చేసేలా రోడ్లు రూపుదిద్దుకోవాలని అన్నారు.
ఏపీలోని పోర్టుల్లో తెలంగాణకు వాటా వచ్చే అవకాశాలు ఉన్నందున మంచిర్యాల- వరంగల్- ఖమ్మం- విజయవాడ కారిడార్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్‌ను మరింత మెరుగుపర్చడం వల్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications