హైదరాబాద్ సీపీగా సజ్జనార్, సీవీ ఆనంద్ కు కీలక బాధ్యతలు..!!
తెలంగాణ ప్రభుత్వ భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. డీజీపీగా శివధర్ రెడ్డి ని నియమించిన ప్రభుత్వం హైదరాబాద్ పోలీసు కమిషనర్ ను మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ కు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు కేటాయించింది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న ఆనంద్ కు హోం శాఖ కార్యదర్శిగా కీలక పోస్టింగ్ లో నియమించింది. సజ్జనార్ స్థానంలో ఆర్టీసీ ఎండీగా సీనియర్ అధికారి నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 23 మంది ఐపీఎస్, ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించారు. కాగా, ఇంటలిజెన్స్ బాధ్యతలను విజయ్ కుమార్ కు కేటాయించారు. ఇక.. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా వీసీ సజ్జనార్ కు నియమించారు. ప్రస్తుతం సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను హోం శాఖ కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయించారు.

ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ ను నియమించారు. మహాలక్ష్మీ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డిని నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్ ను నియమించారు. రవాణా శాఖ కమిషనర్ గా రఘునందన్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఇక.. సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు కేటాయించారు.
ఇక, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్ ను నియమించారు. కాగా.. కీలకమైన పౌరసరఫరాల కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర కు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు నియమితులయ్యారు. హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్ వ్యవహరించనున్నారు.
వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్, అదే విధంగా నారాయణపేట ఎస్పీగా వినీత్ కు బాధ్యతలు కేటాయించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత ను నియమించిన ప్రభుత్వం స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా ను నియమించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా శిఖా గోయల్, ఏసీబీ డీజీగా చారూసిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications