ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు
Telangana Budget 2024: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ బడ్జెట్‌లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. ఇక మూల ధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఊహించినట్టే బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ క్రమంలో రైతులపై వరాల జల్లును కురిపించారు భట్టి విక్రమార్క. ఈ సంవత్సరం తాము ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరబోతోన్నామని అన్నారు. దీని ద్వారా అన్నదాతలకు రైతు బీమాను వర్తింపజేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఫసల్ బీమా యోజన కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు.
ఇందిరమ్మ పథకం కింద పేదలకు భారీగా ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించారు భట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీయేతర లబ్దిదారులకు అయిదు లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం వారికి 6 లక్షల రూపాయల మొత్తాన్ని సాయం రూపేణా అందిస్తామని అన్నారు.
2023- 2024 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 4,50,000 పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటిని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications