రేషన్ కార్డుల విషయంలో తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం; అదే జరిగితే..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని వారికి శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానించిన ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు.
రేషన్ కార్డుల విషయంలో అయోమయం
ఇప్పటికే చాలామంది కొత్తగా పెళ్లి చేసుకున్న యువత వారి తల్లిదండ్రుల పేరుతో ఉన్న కార్డులలో పేర్లను తొలగించడంతో ఆందోళనలో ఉన్నారు. తమకు కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోగా, తమ పేర్లను తల్లిదండ్రుల కార్డులలో తొలగించడంతో రేషన్ కార్డుల విషయంలో అయోమయానికి గురవుతున్నారు. తమకు రేషన్ కార్డ్ వస్తుందా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. ఇక రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలకు తాము దూరమవుతామేమో అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేషన్ కార్డులో ఎవరిపేరు తొలగించినా తీవ్ర ఆందోళన
ఇదే సమయంలో ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతను చేపట్టాలని నిర్ణయించడంతో రేషన్ కార్డుదారులలో ఆందోళన నెలకొంది. ధనవంతులుగా ఉండి పేదలు పొందాల్సిన పథకాలను అక్రమంగా తీసుకుంటున్న వారి రేషన్ కార్డుల ఏరివేత నిర్ణయం సరైనదే అయినప్పటికీ, ఈ ప్రక్రియలో పేదల రేషన్ కార్డులు కూడా పోతే పరిస్థితి ఏమిటి? అన్నది పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డులో ఎవరిపేరు తొలగించినా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వాళ్ళు రేషన్ కార్డులు సరెండర్ చెయ్యాలి
ప్రభుత్వం మాత్రం బోగస్ రేషన్ కార్డులు చాలా ఉన్నాయని గుర్తించి త్వరలోనే వాటిని ఏరివేయడం కోసం సర్వే నిర్వహించాలని భావిస్తుంది. బోగస్ రేషన్ కార్డులతో ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానాకు గండి పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్న వేళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులు వీలైనంత తొందరగా సరెండర్ చేయాలని సూచిస్తున్నారు.
బోగస్ రేషన్ కార్డులు ఉంటే చర్యలు
సరెండర్ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని, అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత ప్రజల సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేయడానికి చర్య తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ క్రమంలో బోగస్ రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ తాజా నిర్ణయం చాలామందిని టెన్షన్ పెడుతోంది.












Click it and Unblock the Notifications