సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే
తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. రోడ్లు- భవనాల శాఖ పురోగతిపై ఆయన సమీక్షించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు మార్చాలని చెప్పారు. జాతీయ రహదారులకు రింగు రోడ్లను అనుసంధానం, హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అవసరమైన నూతన ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. బోధనాసుపత్రులు, ఇతర పెద్దాసుపత్రుల నిర్మాణలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు సైతం ఈవీలే ఉండాలని, రవాణా శాఖలోని మాన్యువల్ విధానాలకు స్వస్తి చెప్పాలని, మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు కొనసాగించాలని అన్నారు. రవాణా శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్‌టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, వెంటనే సొంత భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచాలని, ప్రజల్లో చైతన్యం తేవడానికి షార్ట్ ఫిల్మ్‌లు ప్రదర్శించాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో అధునాతన బస్ టెర్మినల్‌కు స్థలం కేటాయిస్తామని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications