తెలంగాణలో ‘దీపావళి’ పండగ రోజున వ్యాక్సినేషన్ హాలిడే: సిబ్బందికి ఒక్కరోజు విరామం
హైదరాబాద్: దీపావళి పర్వ దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గురువారం(నవంబర్ 4) వాక్సినేషన్‌కు ఆరోగ్యశాఖ సెలవు ప్రకటించింది. దీపావళి పండగ సందర్భంగా నవంబర్ 4న వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇచ్చారు. దీంతో గురువారం అంటే దీపావళి రోజున కోవిడ్ వాక్సినేషన్ ఇస్తున్న వైద్య సిబ్బంది విరామం తీసుకుంటారు.
ఇక, శుక్రవారం నుంచి తిరిగి యధావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని వైద్య అధికారులు వెల్లడించారు. అలాగే దీపాలు వెలిగిస్తున్న సమయంలో శానిటైజర్స్ ఉపయోగించవద్దని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 300లకు దిగువనే నమోదవుతున్నాయి. మరణాలు కూడా తగ్గిపోయాయి. మంగళవారం విడుదల చేసిన కోవిడ్ బులిటెన్ ప్రకారం.. 37,941 కరోనా పరీక్షలు నిర్వహించారు. 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,790 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,898 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,933 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,959కి పెరిగింది. పండగల వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరుపుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా, 10,68,514 మంది నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసులకు 3.43 కోట్లకు చేరింది. మంగళవారం 311 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 14,159 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,51,209 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు 252 రోజుల కనిష్టానికి తగ్గాయి. పాజిటివిటీ రేటు 0.44 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. మంగళవారం 41,16,230 మంది కరోనా టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 107 కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications