కేటీఆర్ క్వాష్ పిటీషన్‌పై పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇవే..!!
KTR: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫార్ములా ఇ కార్ రేస్ అవినీతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్‌ను ఎదుర్కొంటోన్నారు మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల నుంచి వాదోపవాదాలను ఆలకించింది ఉన్నత న్యాయస్థానం. కొద్దిసేపటి కిందటే క్వాష్ పిటీషన్‌పై హియరింగ్ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తుది తీర్పు వెలువడేంత వరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఆయనకు ఊరట ఇచ్చింది. ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించింది.
ఈ గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో మరోసారి క్వాష్ పిటీషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు. అవినీతి నిరోధక విభాగం దాఖలు చేసిన కౌంటర్‌పై విచారించింది. వాదోపవాదాలను ఆలకించింది. ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, కేటీఆర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ దవే వాదనలను వినిపించారు.
ఫార్ములా ఈ- రేస్ నిర్వాహకులకు ఎవరి అనుమతులు లేకుండా 46 కోట్ల రూపాయలను పౌండ్ల రూపంలో హెచ్ఎండీఏ చెల్లించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ వివరించారు. నిబంధనల మేరకు 10 కోట్ల రూపాయలకు మించి జరిగే లావాదేవీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
హెచ్ఎండీఏ మున్సిపల్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిగా ఈ చెల్లింపులకు కేటీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే- అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్ కుమార్‌పైనా కేసు నమోదైందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై సిద్ధార్థ్ దవే తన వాదనలను వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని అన్నారు. అవినీతి జరిగినట్లు ఏసీబీ ఎక్కడే గానీ ఆధారాలను చూపించలేకపోయిందని చెప్పారు. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని న్యాయస్థానానికి అభ్యర్థించారు.
అవినీతి జరగనందు వల్లే ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. వాదోపవాదాలను విన్న అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెలువడేంత వరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.












Click it and Unblock the Notifications