న్యూఇయర్ వేడుకల కోసం ప్రత్యేక అనుమతులపై హైకోర్టులో పిటిషన్: రేపు విచారణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ.. ఉత్వర్వులు ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు పెడుతున్నాయనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక, నూతన సంవత్సర వేడుకలపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవేమి పట్టించుకోవడం లేదని, ప్యాండమిక్, ఎపిడెమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ఒమిక్రాన్ ను కట్టడి చేయకుండా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినిచ్చిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 62 ఒమిక్రాన్ కేసులున్నాయని కోర్టుకు తెలిపారు. ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని.. వేడుకలపై ఆంక్షలు పెట్టే విధంగా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 30వ తేదీ గురువారం విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.

కాగా, న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి సడలింపులు లేవనీ.. గ్రేటర్ పరిధిలోని కమిషనర్లు ప్రకటించారు. అయితే, అదే రోజు సాయంత్రం ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాకుండా అర్ధరాత్రి ఒంటిగంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి ఉంటుందని సీఎస్ సోమేష్ కుమార్ అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు.
న్యూఇయర్ వేడుకలకు ఇంక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఒమిక్రాన్ దెబ్బతో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కానీ, తెలంగాణలో వేడుకలు ఉంటాయా.. ఉండవా.. ఉంటే ఎలాంటి ఆంక్షలతో అనుమతిస్తున్నారనేదే ఉత్కంఠగా మారింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఆసక్తి నెలకొంటోంది.












Click it and Unblock the Notifications