దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారని.. వారి పైన అనర్హత వేటు వేయాలనే పిటీషన్ల పైన తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. విచారణ తరువాత దానం, కడియం విషయంలోనూ స్పీకర్ ఇదే తీర్పు ఇచ్చారు. కాగా.. దానం నాగేందర్ పైన స్పీకర్ నిర్ణయం వెలువడిన తరువాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారం లో హైకోర్టు ఇప్పుడు నోటీసులు జారీ చేసింది.
దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు సంచలనంగా మారుతోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని.. వారి పైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు ఫిర్యాదు చేసారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటంతో... బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనలతో విచారణ వేగవంతం చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లను డిస్మిస్ చేసారు. వారు పార్టీ మారినట్లు ఎక్కడా ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. దీంతో, ఇప్పుడు పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపులపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

హైకోర్టులో పిటీషన్.. నోటీసులు
స్పీకర్ విచారణ సమయంలో దానం నాగేందర్ తీర్పు కు ముందే రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జూబ్లీహిల్స్ తరహాలోనే ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక వస్తుందని అంచనా వేసారు. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ లోనూ చర్చలు జరిగాయి. అయితే, అనూహ్యంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో గతంలో పిటీషన్లు దాఖలు చేసిన నేతలు ఇప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో మహేశ్వర్ రెడ్డి మరోసారి దానం పైన కీలక అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, ఈ వ్యవహారం ఇప్పుడు ఎటు టర్న్ తీసుకుంటుందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications