ఉద్యోగుల బకాయిలు రూ 2, 950 కోట్ల చెల్లింపు - కీలక ఆదేశాలు..!!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల తో చెలగాటం ఆడవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. వారికి సంబంధించిన రిటైర్‌మెంట్ ప్రయోజనాల బకాయిలనే అడుగుతున్నారని వ్యాఖ్యానించింది. విచారణను జూన్ 10కి వాయిదా వేస్తున్నామని.. అప్పటివరకు తమకు బకాయిలు రాలేదని ఏ ఒక్కరూ చెప్పకూడ దని తెలిపింది. ఈ ఆదేశాలు అమలు కాకపోతే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపు పైన హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వాళ్లు ప్రభుత్వ సొమ్ము అడగడం లేదని, వారికి సంబంధించిన రిటైర్‌మెంట్ ప్రయోజనాల బకాయిలనే అడుగుతున్నారని వ్యాఖ్యానించింది. తమకు రావాల్సిన రిటైర్‌మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ వివిధ శాల నుంచి రిటైర్ అయిన పోలీసులు, టీచర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం.. ఏప్రిల్ 9 నాటికి మొత్తం బకాయిలు చెల్లించాలని, లేకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ పిటిషన్లు మళ్లీ విచారణకు వచ్చాయి. విచారణ జాబితాలో మొత్తం 754 పిటిషన్లు ఉన్నాయని.. ఇందులో 737 పిటిషన్లలో ఉన్న దాదాపు 4 వేల మందికి చెల్లించామన్నారు. టోకెన్ నెంబర్ల విషయంలో సాంకేతిక సమస్యలున్న 400 మందికి మాత్రమే నిధులు విడుదల కాలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేశామన్నారు.

జూన్ 10వ తేదీ లోగా చెల్లించాలని ఆదేశాలు
కాగా, ఈ వాదనలను పిటిషనర్ల న్యాయవాదులు వ్యతిరేకించారు. క్లయింట్లతో మాట్లాడామని.. నిధులు రాలేదని.. ప్రస్తుతం విచారణ జాబితాలో 754 పిటిషన్లలో కేవలం 221 పిటిషన్లలో మాత్రమే బకాయిలు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఈ వాదనను ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. తన వద్ద ట్రెజరీ విభాగం అందజేసిన నివేదిక ఉందని, కావాలంటే తనిఖీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కొంతమందికి ఇంకా రిటైర్‌మెంట్ ప్రయోజనాల బకాయిలు రాలేదు.. అంటున్నారు కాబట్టి.. 221 పిటిషన్లు పోగా మిగిలిన పిటిషన్లలో కేసుల వారీగా చెల్లింపుల వివరాలతో అమలు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 10 నాటికి మొత్తం పిటిషనర్ల అందరి బకాయిలు క్లియర్ కావాల్సిందే అని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications