కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి ఘటనకు సంబంధించిన కేసును తెలంగాణ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది.
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పత్రికల వార్తల ఆధారంగా గురువారం ఈ కేసు హైకోర్టులో విచారణ జరగనుంది. మూడు రోజుల క్రితం అంబర్‌పేటలో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
బాగ్ అంబర్‌పేటలో ఉంటున్న గంగాధర్.. తన కొడుకు ప్రదీప్‌ను సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి గంగాధర్ వెళ్లిపోగా.. అప్పుడే నడుచుకుంటూ బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి తీవ్రంగా దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత బాలుడ్ని రెండు కుక్కలు నోట కరచుకుని చెరోవైపు లాగడంతో చనిపోయాడు. బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. మంగళవారం మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి డెటర్నరీ, జీహెచ్ఎంసీ జోనల్ విభాగాల అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలున్నాయని మేయర్ తెలిపారు. ఇందులో 4 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామన్నారు.
గ్రేటర్ లో 30 సర్కిల్స్‌లో కుక్కలను పట్టుకోవడం కోసం 30 టీమ్ లు పని చేస్తున్నాయని తెలిపారు. కుక్కలకు స్టేరిలైజేషన్ చేస్తున్నామని, అయితే.. కొన్ని కుక్కులు స్టేరిలైజేషన్ చేసినా కరుస్తాయన్నారు. కుక్కల కట్టడిలో భాగంగా ప్రతి వార్డులో 20 కుక్కలను దత్తత తీసుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
వీధి కుక్కలకు ఆహారం అందించడం ద్వారా వాటి ఆగడాలను నిరోధించనున్నట్లు పేర్కొన్నారు. కుక్కల దాడిలో బాలుడి మరణం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆకలితోనే కుక్కలు బాలుడిపై దాడి చేశాయని చెప్పారు. ఆ కుక్కలకు మాంసం వేస్తున్న ఓ మహిళ రెండు రోజులుగా అందుబాటులో లేకపోవడంతో కుక్కలు దాడులు చేశాయన్నారు.












Click it and Unblock the Notifications