జూబ్లీహిల్స్ బరిలో ఊహించని అభ్యర్ధి.. అంచనాలు తారుమారు..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఈ ఎన్నిక కోసం బరిలోకి దిగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో ఊహించని నిర్ణయాలు జరుగుతున్నాయి. బరిలోకి కొత్త అభ్యర్ధులు ఎంట్రీ ఇస్తున్నారు. వీరి రాకతో ప్రధాన పార్టీల అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్.. బీఆర్ఎస్ నుంచి సునీత పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తొలుత దీపక్ రెడ్డి పేరు ఖాయమని భావించినా... తాజాగా బీసీ అభ్యర్ధిని బరిలోకి దించాలనే అంశం పైన చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్ - బీఆర్ఎస్ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎంఐఎం ఈ సారి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నా... అసద్ తాజా కామెంట్స్ కొంత సస్పెన్స్ కు కారణం అవుతున్నాయి.

ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాయి. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయని నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్కు బుద్ధి చెబుతామని ప్రకటించాయి.
ఉద్యమకారులకు గతంలో బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు అన్యాయం చేశాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. వీరితో పాటుగా రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)బాధిత రైతులు రంగంలోకి దిగారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో.. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్‌ను మార్చడంతో పాటు నష్టపరిహారాన్ని కూడా పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నార. కాంగ్రెస్ ప్రభుత్వంపై బాధిత రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ రింగు రోడ్డు పరిధిలోని అన్ని గ్రామాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భూనిర్వాసితులంతా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని భావించారు.
ఆ ఎన్నికలు వాయిదా పడటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఈ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా తాము ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టనున్నారు. మరో వైపు నిరుద్యోగ జేఏసీ తమ అభ్యర్ధిని బరిలోకి దించేందుకు సిద్దం అవుతోంది. దీంతో.. ప్రధాన పార్టీలు సామాజిక - స్థానిక సమీకరణాలకు అనుగుణంగా సిద్దం అవుతున్న సమయంలో.. ఈ అభ్యర్ధుల పోటీతో అంచనాలు తారు మారు కావటం అనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications