తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల: ఎప్పుడు ఏయే నోటిఫికేషన్లంటే?
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం రాష్ట్ర శాసనసభలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను జాబ్ క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతోపాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షలు అక్టోబర్‌లో, గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్‌లో, గ్రూప్-3 నవంబర్ లో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ల సమయంలోనే ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విపక్ష సభ్యులకు వివరించారు.

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్, వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, మేలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు.
డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరీయన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్, సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్-2 నోటిఫికేషన్, అక్టోబర్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్-3 నోటిఫకేషన్, నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్, నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
నిరుద్యోగులను రెచ్చగొట్టి గెలిచారు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య చెప్పకుండా మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, ఆ ఉద్యోగాలు ఎక్కడకు పోయాయని నిలదీశారు. ప్రజలు తంతారనే భయంతోనే జాబ్ క్యాలెండర్ పేరుతో ఓ కాగితాన్ని సభలో ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications