Power Purchase:ఏంటి టార్గెట్ చేస్తున్నారా..రేవంత్ సర్కార్ పై కేసీఆర్ ఫైర్..!
హైదరాబాదు:తమ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మీద జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి చేపట్టిన విచారణ సహేతుకంగా లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన నేరుగా జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు. విచారణ చేస్తున్న తీరు సరిగ్గా లేదని అభ్యంతరం తెలిపిన కేసీఆర్.. విచారణ పేరుతో తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ లేఖాస్త్రం..
కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ విచారణ చేపట్టాలని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని విచారణాధికారిగా నియమించింది. అయితే విచారణపై మాజీ సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

విచారణ పేరుతో తనను లక్ష్యంగా చేసుకున్నారని కేసీఆర్ లేఖలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి పార్టీని పతనం చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు. వెంటనే జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ నుంచి స్వచ్చందంగా తప్పుకోవాలని ఆయన రాసిన 12 పేజీల లేఖలో డిమాండ్ చేశారు.
యాదాద్రి,దామచర్ల పవర్ ప్లాంట్లపై నజర్
విద్యుత్ కొనుగోళ్లు, జరిగిన ఒప్పందాలపై అవకతవకలున్నాయని దీనిపై వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పంపిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు.జూన్ 15వ తేదీలోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిందిగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి డెడ్‌లైన్ విధించారు.అయితే దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చేందుకు జూలై 30వ తేదీ వరకు సమయం ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనగోళ్ల అవకతవకలపై విచారణ చేపట్టిన కమిషన్... యాదాద్రి దామచర్ల పవర్ ప్లాంట్‌ల కోసం విద్యుత్ కొనుగోళ్లు ఒప్పంద విషయంలో గోల్‌మాల్ జరిగినట్లు బయటపెట్టింది. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లపై కూడా జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి కమిటీ దృష్టి సారించింది.
విచారణలో భాగంగా ఇప్పటికే తెలంగాణ జెన్‌కో & ట్రాన్స్‌కో మాజీ అధికారి ప్రభాకర్ రావు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సురేష్ చందాలు కమిషన్ ముందు హాజరయ్యారు.చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్న వివాదాస్పదమైన ప్రతిపాదన సమయంలో ఎనర్జీ శాఖలో కీలకంగా వ్యవహరించారు. మొత్తానికి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం కేసీఆర్ మెడకు చుట్టుకుంటోంది. అదే సమయంలో నాటి పాలకులు తీసుకున్న నిర్ణయాలకు అధికారులు బలవుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications