మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత: ఆయనపై రూ. కోటి రివార్డు
కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సంగ్రామ్ అనారోగ్యంతో కన్నుమూశారు. దండకారణ్యంలో ఆయన మృతి చెందినట్లు మావోయిస్టులు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. మరోవైపు రాజారెడ్డి మృతిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు సైతం అధికారికంగా ధృవీకరించారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లె గ్రామానికి చెందిన రాజిరెడ్డి.. తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా రాజిరెడ్డి కొనసాగుతున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టు నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇంఛార్జీగా ఆయన పనిచేశారు.

కాగా, రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా కేసులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై రూ. కోటి రివార్డు ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో ఆయన పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తిలకు రాజిరెడ్డి సహచరుడు. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు రాజిరెడ్డి.
2008 జనవరిలో కేరళలో రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. వివిధ కేసుల్లో నిందితుడిగా రెండున్నరేళ్లు కరీంనగర్ జైలులో ఆయన ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాల్‌పూర్‌లో నలుగురి హత్య కేసులోనూ ఆయన నిందితుడు.
ఉమ్మడి ఏపీలో పీపుల్స్ వార్ చేసిన తొలి హత్య తపాల్‌పూర్ ఘటన. ఈ కేసులో ఏ1గా కొండపల్లి సీతారామయ్య, ఏ2గా రాజిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోల కార్యకలాపాలలో మల్లా రాజరెడ్డి కీలక పాత్ర పోషించారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో పలు పేర్లతో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
రాజిరెడ్డి మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజిరెడ్డి మరణ సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆయన మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. రాజిరెడ్డి మరణాన్ని ధృవీకరించి మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన సోదరుడు కోరారు.












Click it and Unblock the Notifications