జార్ఖండ్‌లో దుండగుల కాల్పుల్లో తెలంగాణ మైనింగ్ అధికారి మృతి
హైదరాబాద్: జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన మైనింగ్ అధికారి వీరగంధం శరత్ బాబు(60) మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే, కాల్పులు జరిపింది మావోయిస్టులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత, మాజీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో అధికారిగా శరత్ బాబు పనిచేస్తున్నారు. ప్రతిరోజూ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో సెక్యూరిటీ గార్డులతో ప్రయాణించే ఆయన మంగళవారం సాధారణ వాహనంలో వెళుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు స్వల్ప గాయాలతో తప్పించుకోగా.. శరత్ బాబు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శరత్ బాబు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

శరత్ ఛాతి, కడుపులో రెండు బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆయన మృతి చెందాడని, హత్యకు కారణాలు తెలియలేదని హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ ఛోటే ప్రకటించారు. శరత్ బాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి హైదరాబాద్ తరలిస్తున్నట్లు హజారీబాగ్ ఎస్పీ వెల్లడించారు. కాగా, అక్కడి పోలీసులు శరత్ బాబును శరత్ కుమార్ గా పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. కాల్పులు జరిపిన దుండగులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం వెలువడిన స్థానిక పత్రికల్లో ఈ వార్త ప్రచురితమైంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన శరత్ బాబు ఖమ్మంలో వీఆర్వోగా పనిచేశారు. ఏలూరు రఘుపతి కుమార్తెను వివాహం చేసుకుని, ఖమ్మంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. శరత్ బాబు కుమారుడు కార్తీక్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ.. తల్లి పద్మతో కలిసి సరూర్‌నగర్ డివిజన్ విజయపురికాలనీలో ఉంటున్నారు. కాగా, శరత్ బాబు తండ్రి వెంకటేశ్వరరావు దివంగత సీఎం, దిగ్గజ సినీనటుడు ఎన్టీఆర్‌కు సన్నిహితుడు. టీడీపీలో కూడా ఆయన కొనసాగారు. శరత్ బాబు సమీప బంధువైన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.












Click it and Unblock the Notifications