బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు - మంత్రి ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు పేర్కొనడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం తమ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్ కు లేఖలు రాశామని గుర్తు చేశారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. అవసరమైతే న్యాయపరంగా పోరాటానికి సిద్ధమని చెప్పారు. అంతేకాకుండా కేంద్ర మంత్రితో స్వయంగా మాట్లాడి, ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. మాకున్న అభ్యంతరాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు.

ఈ విషయంపై తగిన సమయంలో సముచిత రీతిలో స్పందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో కృష్ణా, గోదావరి నదులపై వున్న వివాదాల కంటే, ఇప్పుడు బనకచర్ల మరో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications