రాహుల్ టీంలోకి ఇద్దరు తెలంగాణ మంత్రులు - ఇంఛార్జ్ సహా కీలక మార్పులు..!?
తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల పైన కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం దక్కించుకున్న పట్టు సడలకుండా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా కర్ణాటకలో సీఎం మార్పు చేసిన నాయకత్వం.. ఇక, తెలంగాణలో అవసరమైన నిర్ణయాలకు సిద్దమైంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరిని ఏఐసీసీలో తీసుకోవాలని భావిస్తోంది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మార్పు పైన కొత్త చర్చ మొదలైంది. ఇక.. కేబినెట్ ప్రక్షాళన ఖాయమైంది.
తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా మార్పులు - చేర్పుల పై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేలా నిర్ణయం చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఇంచార్జిలుగా బలమైన నాయకులను నియమించాలని పార్టీ పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న ఇద్దరు మంత్రుల సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రులను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించి వారికి ఆయా రాష్ట్రాల ఇంచార్జ్ బాధ్యతలను కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేసారు. వీరిలో ఒకరు గతంలో ముఖ్యమంత్రి పదవి ఖరారు విషయంలో వార్తల్లో నిలిచారు. మరో మంత్రి పార్టీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు దక్కించుకున్నారు.

తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ కీలక నిర్ణయాలు
ఆ ఇద్దరిలో దక్షిణ తెలంగాణ కు చెందిన మంత్రికి మహారాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇండియా కూటమి తరువాతి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయటంతో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగా రేవంత్ కేబినెట్ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. కొత్త సమస్యలు రాకుండా .. సామాజిక సమీకరణాలు పక్కాగా అమలు చేసే విధంగా కసరత్తు చేయాలని నిర్దేశించారు. పార్టీలో పదవుల పైనా ఆలోచన చేస్తున్నారు. కాగా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి ఉత్సాహాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. పార్టీ నాయకత్వం తీసుకుంటు న్న ఈ నిర్ణయాల పైన నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications