రైలు ఢీ కొట్టి 'టీ' ఉద్యమ నేత మృతి: ప్రమాదమా లేక ఆత్మహత్యా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమంలో ఎందరో కీలకపాత్ర పోషించిన వారు రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగయ్యారనేది అందరికీ తెలిసిన నిజం. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన అలాంటి కోవలోకి వస్తుంది. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని భావించి అహర్నిశలు ఉద్యమమే ఊపిరిగా జీవించిన వ్యక్తి ఆయన.
ఉద్యమం మలిదశలో ఉన్నప్పుడు పోలీసు లాఠీ దెబ్బలు సైతం తిన్నాడు. అంతేనా జైలు జీవితం కూడా గడిపాడు. చివరకు ఆ లాఠీ దెబ్బలకు మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబానికి కూడా భారమయ్యాడు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు జరిగితే న్యాయం జరుగుతుందని అనుకున్నాడు.
కానీ చివరకు ప్రభుత్వ ఆదరణకు నోచుకోలేక మనోవేదనకు గురై గురువారం రైలు కింద పడి ప్రాణాల తీసుకున్నాడు. ఆయన పేరు జక్కుల స్వామి యాదవ్. వయసు 42. నల్గొండ జిల్లాలోని గుండాల మండలం తుర్కలషాపురానికి చెందిన వ్యక్తి. జిల్లాలోని భువనగిరి అర్బన్ కాలనీలో తన అన్న వద్ద ఉంటున్నారు.

స్వామి యాదవ్ గతంలో టీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ మొదలు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్ వరకు అందరూ ఆయన ఉద్యమసూర్తిని కొనియాడారు. ఈ క్రమంలో ఉద్యమస్వామిగా కూడా పేరు పొందారు.
కాగా, టీజేఏసీ నిర్వహించిన మిలీనియం మార్చ్‌కు తన ఊరి నుంచి ప్రజలను తరలిస్తూ అకస్మాత్తుగా ఆర్టీసీ బస్సులోనే కుప్పకూలిపోయారు. ఉస్మానియా వర్సిటీలో జరిగిన ఓ లాఠీచార్జీలో తీవ్రమైన దెబ్బలతో ఆయన నరాలు చచ్చుబడ్డాయి. అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 12ఏళ్ల పాటు సాగిన పోరాటంలో స్వామి యాదవ్ ముందున్నారు. అయితే రైల్వే పోలీసులు మాత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టి చనిపోయాడంటూ కేసు నమోదు చేశారు. ఉద్యమకారులు మాత్రం ఉద్యమ సమయంలో పోలీసులు చేతుల్లో లాఠీ దెబ్బలు తినడం వల్లే స్వామి యాదవ్ అనారోగ్యం పాలయ్యాడని చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం స్వామి దయనీయ పరిస్థితిని చూసి కూడా స్పందించక పోవడం దారుణమంటున్నారు. అనారోగ్యం పాలైన స్వామి యాదవ్‌ను ప్రభుత్వం పట్టించుకోక పోవడం, వైద్యం చేయించుకునే స్థోమత లేక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications