Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana Municipal Verdict:పట్టణాల్లో ప్రజా తీర్పు… మార్పుకు మద్దతు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు. అవి పాలనపై ప్రజల సమగ్ర సమీక్ష. ప్రతి ఓటు వెనుక ఒక ఆశ, ఒక విశ్వాసం, ఒక అభిప్రాయం దాగి ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల నిత్యజీవితానికి అత్యంత దగ్గరగా ఉండే పాలనపై ప్రత్యక్ష స్పందనగా నిలుస్తాయి. అందుకే మున్సిపల్ ఎన్నికల తీర్పు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. తాజా ఫలితాలు తెలంగాణ రాజకీయ దిశను స్పష్టంగా సూచించాయి.

తెలంగాణ రాజకీయాల్లో తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చాయి. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల విజయం మాత్రమే కాదు, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి ప్రతీకగా చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో మాట్లాడుతూ-"2023లో నేను పీసీసీ అధ్యక్షుడిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. 2029లో మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం"-అనే ధీమా ఇప్పుడు రాజకీయ వాస్తవంగా మారుతున్న దృశ్యం కనిపిస్తోంది. తాజా పురపాలక ఫలితాలు ఆ దిశగా ప్రజా మద్దతును బలంగా ప్రతిబింబించాయి. ఈ తీర్పు కేవలం ఓట్ల లెక్క కాదు; పాలనపై ప్రజల ఆమోద ముద్ర.

పంచాయతీ ఎన్నికలలోనే బంపర్ విజయాన్ని నమోదు చేసిన కాంగ్రెస్, మున్సిపల్ ఎన్నికల్లో అదే జోష్‌ను కొనసాగించింది. రాష్ట్రవ్యాప్తంగా 86 పుర నగరపాలికల మేయర్, చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం సాధారణ విషయం కాదు. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐతో కలిసి అధికారం పంచుకోవడం ద్వారా రాజకీయ సమన్వయాన్ని చాటుకుంది. తెలంగాణ ఏర్పాటుకు తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది ప్రజలు 'ప్రజా పాలన' ప్రభుత్వంపై వ్యక్తం చేసిన విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. గ్రామం నుంచి పట్టణం వరకు ఒకే తరహా ప్రజాభిప్రాయం వ్యక్తమవడం రాజకీయంగా గమనించదగ్గ అంశం.

telangana-municipal-verdict-a-warning-to-brs-and-bjp-is-this-the-beginning-of-a-bigger-political-s

టీకాంగ్రెస్ వ్యూహరచన

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ వ్యూహరచన ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు సమన్వయంతో పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇంచార్జిగా నియమించి కమిటీలను ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక నాయకులు అందరూ బాధ్యతగా వ్యవహరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి జిల్లా వారీగా బహిరంగ సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ సీఎం జూమ్ ద్వారా నేతలను అప్రమత్తం చేయడం, వ్యూహాలను వివరించడం పార్టీ అంతర్గత క్రమశిక్షణకు నిదర్శనం. నాయకత్వం, కార్యాచరణ, క్రమబద్ధత-ఈ మూడు అంశాలు కలిసినప్పుడు విజయాలు ఎలా సాధ్యమవుతాయో ఈ ఎన్నికలు చూపించాయి.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నిజామాబాద్ నగరపాలక సంస్థ సహా పలు కీలక మున్సిపాలిటీలను తిరిగి సాధించడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక సమీకరణాలు, సామాజిక సమతుల్యతను పరిగణలోకి తీసుకోవడం, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను ముందుగానే పరిష్కరించడం వంటి చర్యలు ఫలితాలను ప్రభావితం చేశాయి. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ లాంటి నాయకులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పార్టీ పనితీరును మెరుగుపరిచారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత, బూత్ స్థాయి సమన్వయం, సోషల్ ఇంజినీరింగ్...ఇదే గెలుపు సూత్రం.

సంక్షేమ అభివృద్ధి పథకాలే...

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ-అభివృద్ధి పథకాలే ఈ విజయానికి ప్రధాన బలం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగింది. రూ.500 గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలు మధ్యతరగతి, పేదల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకువచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలు గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి మద్దతును బలోపేతం చేశాయి. సంక్షేమం కేవలం ప్రకటనల స్థాయిలో కాకుండా, లబ్ధిదారుల జీవితాల్లో అనుభవించే మార్పుగా మారడం ఈ ఎన్నికల్లో ప్రతిఫలించింది.

వ్యవసాయ రంగంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ వంటి హామీల అమలు రైతు వర్గం విశ్వాసాన్ని గెలుచుకుంది. రైతు సమస్యలను కేవలం హామీలతో కాకుండా కార్యాచరణతో పరిష్కరించాలనే ప్రభుత్వ దృక్పథం స్పష్టంగా కనిపించింది. యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయడం యువతలో ఆశలను పెంచింది. మహిళా సాధికారిత దిశగా 'ఇందిరా మహిళా శక్తి' పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం కల్పించడం గమనార్హం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలు సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ కట్టుబాటును చాటుతున్నాయి. ఈ చర్యలు కేవలం వాగ్దానాలుగా కాకుండా అమలులో ఉన్న నిర్ణయాలుగా ప్రజల ముందున్నాయి.

తాను తీసుకున్న గోతిలోనే పడ్డ బీఆర్ఎస్

ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీఆర్‌ఎస్, బీజేపీ అవాస్తవాలతో ప్రచారంతో ఎన్నికల రంగంలోకి దిగినా ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల భారం, నిరుద్యోగ సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని కలిగించాయి. మరోవైపు, కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న బీజేపీ తెలంగాణకు తగిన నిధులు ఇవ్వలేదనే భావన బలపడింది. విభజన హామీలు అమలు కాలేదనే విమర్శలు ఎన్నికల్లో ప్రతిఫలించాయి. ప్రజలు ప్రచారానికి కాకుండా అనుభవానికి ఓటు వేశారనేది స్పష్టమైంది.

రాజకీయంగా ఈ ఫలితాలు 2028 అసెంబ్లీ, 2029 పార్లమెంట్ ఎన్నికలకు మార్గసూచికగా కనిపిస్తున్నాయి. 'తెలంగాణ రైజింగ్ 2047' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, పుర ఎన్నికల్లోనూ ప్రజలు అదే అభివృద్ధి దిశకు మద్దతు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నుంచి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు లభిస్తున్న విజయ పరంపర పార్టీ స్థిరత్వాన్ని సూచిస్తోంది. అయితే విజయం అంతిమ గమ్యం కాదు; అది కొత్త బాధ్యతల ఆరంభంగా భావించాలి. స్థానిక సంస్థల్లో అధికారాన్ని పొందడం ద్వారా అభివృద్ధి వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పార్టీపై మరింత పెరిగింది. పారదర్శక పాలన, అవినీతి నిరోధక చర్యలు, వనరుల సమర్థ వినియోగం ఇవన్నీ కొనసాగితేనే ప్రజా విశ్వాసం దీర్ఘకాలికంగా నిలుస్తుంది. ప్రజా ఆశలు ఎంత పెరుగుతాయో, బాధ్యతలు అంత పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మొత్తంగా, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఒక దిశను సూచిస్తోంది-సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం. రేవంత్-మహేష్ జోడి సమన్వయం, పార్టీ శ్రేణుల కృషి, ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల ప్రభావం వెరసి కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టాయి. ప్రజా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే, ఈ విజయ పరంపర మరింత బలపడడం ఖాయం. ప్రజల విశ్వాసం అన్నది రాజకీయాల్లో అత్యంత విలువైన మూలధనం; ఆ మూలధనాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే తెలంగాణ భవిష్యత్తు మరింత దృఢంగా నిలుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+