తెలంగాణ నుంచి మరో వందేభారత్ రైలు: ఎక్కడ్నుంచి, ఎక్కడికంటే..?
హైదరాబాద్: తెలంగాణకు త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే రాబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కాగా, ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకు మూడు వందేభారత్ రైళ్లను భారతీయ రైల్వే శాఖ ప్రతిపాదించింది.
ఇందులో భాగంగా ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య జనవరిలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాగా, మరొకటి సికింద్రాబాద్ మధ్య ఏప్రిల్ నెలలో పట్టాలెక్కింది. మూడోది సికింద్రాబాద్-పుణె మధ్య ఉంటుందని అనుకున్నారు. కానీ, అంతకుముందు సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు నగరాలకు వందేభారత్ రైలును నడిపేందుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య 581 కిలోమీటర్ల దూరంగా ఉండగా.. ఈ రెండు మార్గాల మధ్య ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంది. ఈ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే రెండు నగరాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత దృఢంగా మారుతాయని మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఇటీవల రైల్వే శాఖ మంత్రిని కలిసిన సమయంలో కోరారు. ఈ క్రమంలోనే వందేభారత్ రైలుకు సంబంధించిన తాత్కాలిక టైం టేబుల్ రైల్వే అధికారులు రూపొందించారు.
దీని ప్రకారం ఈ వందేభారత్ రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటకు బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు ఈ మార్గంలో నడుస్తుంది. బల్లార్షా, సిర్పూర్, కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేటల్లో ఆగనుంది.
ఈ వందేభారత్‌లోఏసీ చైర్ క్లాస్ టికెట్ రూ.1,450- రూ.1,550, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ రూ.2,750-రూ.2,850గా ఖరారు చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రారంభమైన వందేభారత్ రైళ్లకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు ప్రధాని మోడీ. హైదరాబాద్-బెంగళూరు మధ్య కూడా వందేభారత్ రైలు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications