రేవంత్ సర్కారు కీలక నిర్ణయం: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణం, ఎక్కడంటే?
హైదరాబాద్: తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరుకోవడంతో రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(MCR HRD)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సమావేశమయ్యారు.
ఈ భేటీలో సీఎస్ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఇప్పుడున్న హైకోర్టు శిథిలావస్థకు చేరుకుందని హైకోర్టు సీజే.. సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన రేవంత్.. ఎక్కడ వంద ఎకరాల కంటే ఎక్కువ ప్రభుత్వ స్థలం ఉందో అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు.

రాజేంద్రనగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉందని అధికారులు తెలియజేయడంతో.. అక్కడే హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. జనవరిలో శంకుస్థాపన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ అయినందున.. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula అధికారులను ఆదేశించారు. ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ అంశంపై… pic.twitter.com/dmtH4Q3G6T
— Telangana CMO (@TelanganaCMO) December 14, 2023
ఆ భవనాన్ని రెనోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరోవైపు, కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి చొరవ చూపాలని హైకోర్టు సీజే.. సీఎం రేవంత్ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో కొత్త జిల్లాల్లో కోర్టుల నిర్మాణానికి కూడా ఎక్కడెక్కడ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణాలు అవసరమవుతాయో.. ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications