తెలంగాణ ప్రజలు బీజేపీకి ఫేవర్, డబుల్ డిజిట్ పక్కా: పోలింగ్‌పై కిషన్ రెడ్డి ధీమా
తాము ఆశించిన విధంగానే బీజేపీకి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారని.. డబుల్ డిజిట్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్, రాహుల్ గాంధీ మాటలను హస్తం పార్టీ కార్యకర్తలే కాకుండా ఎమ్మెల్యేలు సైతం నమ్మలేదని ఎద్దేవా చేశారు.
సోమవారం జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు బీజేపీకే మొగ్గు చూపారని, తాము ఆశించినట్లుగానే ఆ పార్టీకి రెండంకెల సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అయినా సీఎం రేవంత్, రాహుల్ గాంధీ మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. ఆ పార్టీ కార్యకర్తలే వీరి మాటలను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ఏ పార్టీవారైనా సరే ప్రధానిగా మోడీ ఉండాలని ప్రజలు భావించారని చెప్పారు. పట్టణప్రాంత వాసులే కాదని, ఈసారి పల్లెల్లోనూ బీజేపీకు ఓట్లు బాగా పెరిగాయన్నారు.
చాలా మంది ఓటర్లు మోడీకే ఓటు వేస్తున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగా చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లోనూ కొంత పోలింగ్ శాతం తగ్గిందని, అయినా బీజేపీకి సానుకూలంగా ఓట్లు పడ్డాయన్నారు. ఎక్కువ మంది ఏపీ ప్రజలు ఓట్ల కోసం అక్కడికి వెళ్లిపోయారని, అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిందని వివరించారు.
హైదరాబాద్‌లో సెలబ్రిటీలు కూడా క్యూలో నిలబడి ఓటేశారని, వారు లైన్లో నిలబడి ఓటేయడం మంచి సందేశమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటేశారని, ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం బలపడటానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.7 శాతం జరిగిందని, ఈసారి ఇది 65 శాతం దాటుతుందని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications