తెలంగాణలో అధికారం మాదే; బీ ఫామ్ కావాలంటే గూగుల్ పే చెయ్యండి: కేఏ పాల్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఒక పక్క అధికార బి ఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు హోరా హోరీగా ఎన్నికలలో తలపడుతుంటే, మరొక పక్క బిఎస్పి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తో పాటు, కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల సమరంలో నేనున్నానంటూ ముందుకు వచ్చింది.
తాజాగా తెలంగాణ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రానుందని కేఏ పాల్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అని ప్రశ్నించిన ఆయన, గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మునుగోడు, హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అసలే లేదని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీ నే అని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్ గులాబీ జెండా మోసే వాళ్ళకే తప్ప వేరే వాళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వమని చెబుతున్నారని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు అడిగిన వారిని బెదిరిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు కూడా ప్రజాశాంతి పార్టీ అండగా ఉంటుందని కే ఏ పాల్ తెలిపారు. ప్రజాశాంతి పార్టీ నుండి ఎన్నికలలో పోటీ చేయాలని భావించే ఆశావహులంతా 10000 రూపాయలు కట్టి బీఫామ్ తీసుకోవాలని, ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలని కేఏ పాల్ కోరారు.
60 శాతం ఉన్న బీసీలకు 60 శాతం సీట్లు ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నానని కేఏపాల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు బీసీలు సీఎం ఎందుకు కాలేదని కేఏపాల్ ప్రశ్నించారు. పోటీ చేయాలనుకునే వారు వారంలోగా పదివేల రూపాయలు గూగుల్ పే చేసి దరఖాస్తు పంపాలని వారం రోజుల్లోగా లిస్టు రిలీజ్ చేస్తామని కేఏపాల్ తెలిపారు.












Click it and Unblock the Notifications