తెలంగాణలో ఎవరికి మూడిందో గానీ..?
Telangana Lok Sabha election 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, మాజీ మంత్రులు, టాలీవుడ్ సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తంగా తెలంగాణలో 64.93 శాతం మేర పోలింగ్ నమోదైంది. 10 స్థానాల్లో పోలింగ్ శాతం 70ని దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జంటనగరాల పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా 60 నుంచి 70 శాతం లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆదిలాబాద్- 72.96, పెద్దపల్లి- 67.88, కరీంనగర్- 72.33, నిజామాబాద్- 71.50, జహీరాబాద్- 74.54, మెదక్- 74.38, మల్కాజ్‌గిరి- 50.12, సికింద్రాబాద్- 48.11, హైదరాబాద్- 46.08, చేవెళ్ల- 55.45, మహబూబ్‌నగర్- 71.54, నాగర్‌కర్నూల్- 68.86, నల్గొండ- 73.78, భువనగిరి- 76.47, వరంగల్- 68.29, మహబూబాబాద్-70.68, ఖమ్మం- 75.19 శాతం పోలింగ్ రికార్డయింది.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహించిన మల్కాజ్‌గిరిలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయింది. సికింద్రాబాద్, హైదరాబాద్ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదనే విషయం ఇక్కడ స్పష్టమౌతోంది. బీఆర్ఎస్ విజయం సాధించిన నియోజకవర్గాల్లో అంచనాలకు తగ్గట్టే పోలింగ్ శాతం నమోదైంది.
అత్యధికంగా పోలింగ్ నమోదయిన జాబితాలో భువనగిరి, ఖమ్మం స్థానాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలు ఇవి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెల్లడవుతుంది.












Click it and Unblock the Notifications