తెలంగాణలో టీచర్లకు కీలక బాధ్యతల అప్పగింత
జనాభా లెక్కల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027లో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ ఇది. దీనికోసం దాదాపు 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించనుంది. ఇది దేశంలో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరిగే తొలి జనాభా గణన కావడంతో ప్రభుత్వం సమగ్ర సన్నాహాలు ప్రారంభించింది. సకాలంలో కార్యాచరణ ప్రణాళిక, బాధ్యతలపై అవగాహన కల్పించడానికి త్వరలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది.
ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయి జన గణన సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లా స్థాయిలో పరిపాలన, లాజిస్టికల్, కార్యాచరణ ఏర్పాట్లను సమీక్షించారు. 2027 జన గణనను విజయవంతం చేయడానికి సమన్వయం అవసరమని, సకాలంలో నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికి అన్ని శాఖలు సహకారం అందించాలని సూచించారు.

అధికారులకు ఉద్యోగుల తాత్కాలిక అంచనా సిద్ధం చేయాలని రామకృష్ణా రావు ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ గణనలో మురికివాడలు, మారుమూల ప్రాంతాలన్నీ కవర్ చేయాలని, ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండకూడదని అన్నారు. ఈ విషయంలో జనాభా గణాంకాల సిబ్బందికి నాణ్యమైన శిక్షణ చాలా ముఖ్యమని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. సెన్సస్ డిజిటల్ విధానంలో లోపాలు తలెత్తకూడదని, మారుమూల గ్రామాలు, తండాలు, చిన్న చిన్న ఆవాసాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు డబుల్ ఎంట్రీలు ఉండకూడదని సూచించారు.
ఈ సందర్భంగా జన గణన డైరెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ.. 2027 గణన కోసం తొలి దశలో మొత్తం 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపారు. వీరిలో ప్రధానంగా ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు జనాభా లెక్కింపుదారులు, సూపర్ వైజర్లుగా నియమితులవుతారని ఆమె తెలిపారు.
ఈ సమావేశానికి ఆర్థిక ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అటవీ ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా ఛోంగ్తు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, సాధారణ పరిపాలన కార్యదర్శి ఈ శ్రీధర్, మున్సిపల్ కార్యదర్శి టీకే శ్రీదేవి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications