కృష్ణాపై తేలని పంచాయతీ: ఏపీ నేతల కుట్రలంటూ హరీశ్ ఫైర్
న్యూఢిల్లీ/మెదక్: కృష్ణా నదీ జలాల వినియోగం, అమలు యంత్రాంగం, యాజమాన్య బోర్డు తీరు, అధికార పరిధిపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సీనియర్ అధికారులతో మంగళవారం జరిపిన చర్చలు ఎటూ తేలలేదు. కృష్ణా నదీ పై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వాదించింది.
అయితే, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అంతిమ తీర్పు రానంత వరకు ఏపీ ప్రతిపాదనను తాము అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ తెగేసి చెప్పింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు రెండు రాష్ట్రాలు తాత్కాలిక నీటి కేటాయింపులతో ముందుకు సాగాల్సిందేనని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.
జలాల వినియోగానికి సంబంధించిన వర్కింగ్ అరేంజ్‌మెంట్లపైనా వీరి మధ్య పొసగలేదు. దీంతో బుధవారం మరోసారి సమావేశమై తెలుగు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిర్చేందుకు అమర్‌జీత్ సింగ్ ప్రయత్నించనున్నారు. అయితే రేపుకూడా ఇదే రకమైన పరిస్థితి అనివార్యమేనని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు అంటున్నారు. కృష్ణా నదీ జలాల వినియోగం వివాదంపై రెండు స్థాయిల్లో చర్చలు జరిగాయి.
అమర్‌జీత్ సింగ్ మొదట తన చాంబర్‌లో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమై మధ్యాహ్నం 12న్నర గంటల వరకు చర్చించారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో వారిని నీటిపారుదల ప్రాజెక్టుల కమీషనర్ పుష్పేందర్ వోరా వద్దకు పంపించారు. సాయంత్రం ఆరున్నర వరకూ పుష్పేందర్ సింగ్ వీరితో చర్చలు జరిపారు. ఆ తరువాత వారంతా అమర్‌జీత్ సింగ్ వద్దకు వెళ్లి రాత్రి ఎనిమిది గంటల వరకూ మంతనాలు సాగించారు. అయినా ఎలాంటి పురోగతి లేక పోవడంతో బుధవారం కూడా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ చర్చల సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారులు కొత్త సమస్యలు లేవనెత్తడమే కాకుండా పరస్పరం ఆరోపించుకున్నట్టుగా కూడా తెలిసింది. అందుకే ఎలాంటి ఒప్పందం, అవగాహనకు రాలేక పోయారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎస్.కె.జోషి, శశిభూషణ్‌కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట జల వనరుల విభాగం చీఫ్ ఇంజనీర్లు నరసింహరావు, రామకృష్ణ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
చర్చల సమయంలో వీరు హడావుడిగా బైటికి వచ్చి తమ ఇంజనీర్లతో చర్చించటం, సమాచారం తీసుకోవటం జరిగింది. కృష్ణా నదీ జలాల యాజమాన్యం బోర్డు పని తీరు విషయంలో విస్తృత చర్చల జరిగినా ఎలాంటి అవగాహన కుదరలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు మీడియాకు చెప్పారు.
ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు గత సంవత్సరం అమలు చేసిన విధంగానే నీటి యాజమాన్యం కొనసాగాలని, అప్పటి వరకూ కొత్త ఏర్పాట్లను తాము అంగీకరించేది లేదని స్పష్టం చేసినట్టు చెప్పారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నీటిని వాడుకోవచ్చు కదా అన్న ప్రశ్నకు గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఒకటి, రెండు సంఘటనల్లో ఇష్టానుసారంగా జలాలు తీసుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా జలాలు వినియోగించుకోవడాన్ని తాము అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. బోర్డు ప్రతిపాదనను నోటిఫై చేసే అంశం చర్చకు రాలేదన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811టిఎంసి జలాల నుండి ఆంధ్రప్రదేశ్ 512 టిఎంసిలు, తెలంగాణ 299 టిఎంసిలు వాడుకునేలా గత ఏడాది ఒప్పందం కుదిరింది. కృష్ణా నదిలో 811 టిఎంసిల కంటే అధిక జలాలు వచ్చినా ఇదే పద్ధతిలో పంచుకోవాలనే అవగాహనా కుదిరింది.
బోర్డు ఒక నిర్ణయం తీసుకున్న తరువాత కూడా నీటి విడుదల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఆరోపించింది కూడా. బోర్డు పరిధిని నోటిఫై చేసి ప్రాజెక్టులను దాని ఆధీనంలోకి తీసుకోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరింది. ఆ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ కూడా రాశారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవంటూనే కొత్త ప్రాజెక్టులను చేపడతారన్నది ఏపీ అధికారుల వాదన.

ఏపీ వినియోగం ఎక్కువే: తెలంగాణ
కేటాయించిన జలాల కంటే ఆంధ్రప్రదేశ్ అధిక జలాలు వాడుకుంటోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. గత ఏడాది జరిగిన సంఘటనల కారణంగానే వర్కింగ్ అరేంజ్‌మెంట్స్ విషయంలో తాము పట్టుదలగా ఉన్నామన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశం ట్రిబ్యునల్ విచారణలో ఉందని, కేటాయింపుల్లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తొలగించాలని పట్టుబట్టినట్టుగా తెలిసింది.
ట్రిబ్యునల్ తుది తీర్పు రాకుండా బోర్డు పరిధిని ఎలా నిర్ణయిస్తారనీ గట్టిగా అడిగినట్టు చెబుతున్నారు. మొత్తం జలాలల్లో తెలంగాణ వాటా ఎంతో తేలేవరకూ తాత్కాలిక నీటి వినియోగం ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు పరిమితం కావల్సిందేనని ఉద్ఘాటించారు.
పోలవరం ప్రాజెక్టు నుండి కృష్ణా బేసిన్‌కు మళ్లించే 80 టిఎంసిల్లో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు 35 టిఎంసిలు కేటాయించగా మిగిలిన 45 టిఎంసి జలాలను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ భాగంలోని ప్రాజెక్టులకు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ 45 టిఎంసిలు తమవేనని తెలంగాణ వాదించిందని అంటున్నారు. పట్టిసీమ పోలవరంలో భాగం కాదని ఏపీ చెబుతున్నందున ఇందులో 45 టిఎంసిలు కలిపి మొత్తం 90 టిఎంసిలు అదనంగా వస్తాయని, వీటిని కూడా పంపిణీ చేయాల్సిందేనని తెలంగాణ వాదించినట్టు చెబుతున్నారు.
ఏపీ నేతల కుట్రలంటూ హరీశ్ ఫైర్: టీ కాంగ్రెస్, టిడిపిపైనా
తెలంగాణ నీటి ప్రాజెక్టులను అడ్డుకునే విషయంలో ప్రతిపక్ష పార్టీలు, ఆంధ్రా నాయకుల ఎజెండాను అమలు చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలోని 20 లక్షల ఎకరాలకు నీరందించే మల్లన్నసాగర్ జలాశయం నిర్మించకుండా వారు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ప్రాజెక్టుల్లో జాప్యం జరిగి నీళ్లన్నీ దిగువకు పోవాలని వారు చూస్తున్నారన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులతో కలిసి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టులు ఆపాలని ఆంధ్రా నేతలు చేస్తున్న ప్రయత్నాలకు ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు సహకరించడం దురదృష్టకరమన్నారు.
లేని వివాదాలను జఠిలం చేసి, ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరిగేలా కాంగ్రెస్, టిడిపిలు ప్రయత్నిస్తున్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో టిడిపి, కరీంనగర్‌లోని తోటపల్లి జలాశయం నిర్మాణంలో కాంగ్రెస్ నేతలు.. ముంపు అయినా సరే పాత ఆకృతిలోనే నిర్మాణం చేపట్టాలని ధర్నాలు చేశాయన్నారు. వారే మల్లన్నసాగర్ జలాశయంలో ప్రజలను ముంచేస్తున్నారంటూ రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసమని హరీశ్ రావు ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ సైతం ముంపు బాధిత కుటుంబం నుంచే వచ్చారని, నిర్వాసితుల కష్టాలేంటో ఆయనకు తెలుసన్నారు. ముంపు బాధిత గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. దయచేసి ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దంటూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు. భూసేకరణ చట్టం 2013 ద్వారా ఎకరాకు కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే అందుతాయన్నారు.
కానీ, తాము మాత్రం ప్రభుత్వ ఉత్తర్వు 123 ద్వారా భూమితో పాటు ఇతరత్రా అంశాలను కలిపి ఎకరాకు రూ.7 లక్షల వరకు చెల్లిస్తున్నామన్నారు. జలాశయం నిర్మించాక ముంపు బాధితులతో సంఘాన్ని ఏర్పాటుచేసి చేపల పెంపకం బాధ్యతను వారికే ఇస్తామన్నారు.
ఈ విషయాన్ని గమనించి ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండింటిలో ప్రజలకు ఏది నచ్చితే దాని ప్రకారం భూసేకరణ చేయడానికి తాము సిద్ధమన్నారు. ఇప్పటికే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టరుకు సూచించామన్నారు.












Click it and Unblock the Notifications