Telangana SIR: 74 లక్షల మందికి గుడ్ న్యూస్- ఈసీ కీలక అప్డేట్..!
తెలంగాణలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై (Telangana SIR) మరో కీలక అప్డేట్ వచ్చింది. గతంలో ఎస్ఐఆర్ లో నమోదు సందర్భంగా వివిధ కారణాలతో తిరస్కరణకు గురై, నోటీసులు జారీ చేసిన 74 లక్షల మంది ఓటర్లకు, విచారణల అనంతరం తిరిగి ఓటర్ల జాబితాలో చేరుస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీరు తుది ఓటర్ల జాబితాలో చేర్చడానికి ఆమోదం పొందారని ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో నిన్నటి వరకూ అనర్హులుగా తేలిన ఓటర్ల సంఖ్య 12,969గా ఉందని వెల్లడించింది.
SIR ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది నమోదిత ఓటర్లు ఉండగా, ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినప్పుడు ఆ సంఖ్య 2,64,87,213గా ఉంది. గైర్హాజరు, బదిలీ, మరణం, డూప్లికేట్ వర్గాల కింద ముసాయిదా జాబితా నుండి మొత్తం 73,39,235 పేర్లను తొలగించారు. ముసాయిదా జాబితాలో కొనసాగిన ఓటర్లలో, సుమారు 1.72 కోట్ల మందికి ఎలాంటి వ్యత్యాసాలు లేదా మ్యాపింగ్ ఫ్లాగ్‌లు లేవు. మరో 92,88,187 కేసులను తదుపరి పరిశీలన కోసం గుర్తించారు.అక్టోబర్ 8 నాటికి జారీ అయిన 92.88 లక్షల నోటీసులలో 92.23 లక్షల నోటీసులను పంపిణీ చేశారు.

వీటిలో ఇప్పటివరకు 82,11,205 కేసుల విచారణ పూర్తి చేశారు. వాటిలో 74,62,851 కేసులు తుది ప్రచురణకు అర్హమైనవిగా గుర్తించారు. మరో 18,12,237 కేసులలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువు అక్టోబర్ 7న ముగిసినప్పటికీ, నోటీసులు జారీ చేయడం, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అలాగే తుది ఓటర్ల జాబితాలను నవంబర్ 9న ప్రచురించనున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై పలు వివాదాలు నెలకున్నాయి. ఫామ్ 7 ద్వారా భారీ ఎత్తున ఓట్ల తొలగింపుకు పలు చోట్ల బీఎల్ఏలు దరఖాస్తులు చేయడం, వీటిలో అక్రమంగా తేలిన చోట కేసుల నమోదు వరకూ వెళ్లారు. చివరికి వీటిని సవరించారు. అనంతరం 74 లక్షల మందికి పైగా ఓటర్లు తుది జాబితాలో చేర్చేందుకు ఆమోదం పొందారు.














Click it and Unblock the Notifications
