తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి మొదలు కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సెక్రటరీ, వీటీజీ సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఆర్‌ఈఐఎస్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఐదో తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2023-24విద్యాసంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా జనవరి 6ను నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100లు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష-2024, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. సంబంధిత జిల్లాల్లోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్ధుల వయసుకు సంబంధించి ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50,000, పట్టణ ప్రాంతంలో రూ.2,00,000 మించకుండా ఉండాలి.
జనవరి 6లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ఫిబ్రవరి11న రాతపరీక్ష నిర్వహించి, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఇతర వివరాలకు 1800 425 45678 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ప్రవేశ పరీక్ష విధానం:
తెలంగాణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశ పరీక్ష-2024 ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ విధానంలో 10 ప్రశ్నలకు100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగుకు 20 మార్కులు, ఇంగ్లిష్ 25 మార్కులు, గణితం 25 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 10 మార్కులు, పరిసరాల విజ్ఞానం 20 మార్కులు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: డిసెంబర్ 18, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2024.
ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11, 2024.












Click it and Unblock the Notifications