22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రిజిస్ట్రేషన్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
22ఏ నిషేధిత భూముల అంశంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ ఎంసీ, డీటీసీపీ, హెచ్ ఎండీఏ అనుమతి ఉంటే 22ఏలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది ప్లాట్ల యజమానులకు, సామాన్య గృహ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇక గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా 22 ఏ భూముల అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల నుంచి అనుమతులు పొంది ఇళ్లు, స్థలాలను కొనుగోలు చేసినప్పటికీ లక్షలాది మంది ప్లాట్ల యజమానులు, సామాన్య గృహ వినియోగదారులకు చెందిన ఆయా సర్వే నెంబర్లు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న నేపథ్యంలో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి భారీగా ఉపశమనం లభించింది.
టెక్నికల్ సమస్యలు లేదా రెవెన్యూ వర్గీకరణ వల్ల 22 ఏ జాబితాలో చేరినప్పటికీ చట్టబద్ధమైన ప్రణాళికా సంస్థల నుంచి అనుమతులు ఉంటే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో చాలాకాలంగా స్తంభించి పోయిన స్థిరాస్తి లావాదేవీలు తిరిగి ఊపందుకుంటాయని పలువురు భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఖజానాకు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో భారీగా రాబడి సమకూరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు తెలంగాణ శాసనసభలో ఇటీవల 22 ఏ భూముల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో జారీ చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఛైర్ పర్సన్ గా వ్యవహరించే ఈ కమిటీలో రాజీవ్ గాంధీ హనుమంతు, సందీప్ కుమార్ ఝా సభ్యులుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications
