మంత్రి సబితకు గవర్నర్ తమిళిసై పిలుపు: రాష్ట్ర ప్రభుత్వానికి, యూజీసీకి లేఖ
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై యూజీసీకి ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయాల ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు.

సబిత ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై
రాజ్‌భవన్‌కు వచ్చి బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ బిల్లుపై అభిప్రాయం కోరుతూ యూజీసీకి లేఖ రాశారు. తెలంగాణ శాసనసభ, మండలి ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కీలకమైన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు ఒకటి.

గవర్నర్ వద్ద కీలక బిల్లు.. విద్యార్థుల హెచ్చరికలు
భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు, విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకుల భర్తీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ, మండలిలో ఆమోదించింది. ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇటీవల విద్యార్థి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ బిల్లు ఆమోదంపై ఒత్తిడి వస్తోంది. రెండు రోజుల్లో బిల్లు ఆమోదించకపోతే రాజ్‌భవన్ ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.

ఉద్యోగాల భర్తీపై గవర్నర్ ఆందోళన: యూజీసీ లేఖ
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలోనే తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి లేఖ రాశారు. ఈ బిల్లు ఆమోదించడం వల్ల ఏమన్నా న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు.
యూజీసీకి కూడా లేఖ రాసిన తమిళిసై.. బిల్లు అభిప్రాయాన్ని కోరారు. గత మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయాలని పదే పదే చెబుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా ఉమ్మడి నియామక బోర్డు తీసుకురావడం ద్వారా మళ్లీ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని, నియామకాలు ఆలస్యమవుతాయని అన్నారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు దెబ్బ తింటాయని లేఖలో పేర్కొన్నారు.
ఇది ఇలావుండగా, హోంమంత్రి అమిత్ షాను గవర్నర్ తమిళిసై కలిశారు. పదవి చేపట్టి మూడేళ్లు పూర్తి కావడంతో మర్యాదపూర్వకంగా కలిశానని తమిళిసై చెప్పారు.












Click it and Unblock the Notifications