తెలంగాణ బడ్జెట్: రైతులకు శుభవార్త: ఆ మొత్తాన్ని మేమే భరిస్తాం: సన్నబియ్యంపై బోనస్
Telangana Budget 2024: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణ బడ్జెట్‌లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. ఇక మూల ధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఊహించినట్టే బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ క్రమంలో రైతులపై వరాల జల్లును కురిపించారు భట్టి విక్రమార్క. ఈ సంవత్సరం తాము ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరబోతోన్నామని అన్నారు. దీని ద్వారా అన్నదాతలకు రైతు బీమాను వర్తింపజేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఫసల్ బీమా యోజన కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు.
రైతుల మీద ఒక్క పైసా కూడా భారం పడకుండా చూసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రైతుల మీద పడే బీమా ప్రీమియం మొత్తాన్నీ తామే భరిస్తామని తేల్చి చెప్పారు. బీమా ప్రీమియం మొత్తం తమ మీద పడుతుందనే ఆందోళన చెందనక్కర్లేదని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో- వరి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేకించి- సన్న బియ్యాన్ని పండించే రైతులకు అదనంగా వరాలను ఇచ్చింది. తెలంగాణలో వరి సాగు విస్తారంగా ఉంటోండటం, దీనిపై అధిక శాతం మంది రైతులు ఆధారపడటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
వరి సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు నష్టపోతున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ఇబ్బందులను తొలగించడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. సన్న బియ్యాన్ని పండించే రైతులను మరింత ప్రోత్సహిస్తామని అన్నారు. 33 రకాలను సన్న బియ్యం, వెరైటీలను సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు 500 రూపాయలను బోనస్‌గా ఇస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications