కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్, విచారణకు ఆదేశం
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమిషన్ అభిప్రాయపడింది. తెలంగాణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని తెలంగాణ మహిళా కమిషన్ ఆదేశించింది. కాగా, బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు తాము వద్దనట్లేదన్నారు కేటీఆర్. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేకు డ్యాన్సులు వేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు.

బస్సుల్లో సీట్లకోసం మహిళలు కొట్టుకుంటున్నారని, డ్రైవర్లు కండక్టర్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బస్సులు ఎక్కువ పెట్టండి, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టండంటూ కాంగ్రెస్ ప్రభుత్వంనుద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యనించారు.
మరోవైపు, మంత్రి సీతక్క.. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ కేటీఆర్ జుగుప్సకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తండ్రి ఆయనకు నేర్పిన సంస్కారం ఇదేనా? అంటూ ప్రశ్నించారు మంత్రి సీతక్క. కేటీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదన్నారు.
మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి సీతక్క అన్నారు. వెంటనే తెలంగాణ మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. మరోవైపు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇతర కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తమ ప్రభుత్వం అందిస్తుంటే.. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications