Telangana: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. దీంతో ప్రజలు మళ్లీ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ లో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 43.5, పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ లో 43.4, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భువనగిరి, నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటొచ్చని అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, మెదక్, జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇచ్చింది.
సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలోని దాదాపు చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 6 తర్వాత రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications