Winter: తెలంగాణలో క్రమంగా పెరుగుతోన్న చలి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో మళ్లీ చలి పెరుగుతోంది. 10 రోజుల కింద భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా మామూలుగా ఉంటున్న చలి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు.ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. చలి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
మరో రెండ్రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. జనవరి ఒకటో తేదీ తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ శివారులో చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం చలితో పాటు విపరీతమైన పొగ, మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పలు జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాల్‌లో 10.7, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 11.2, నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో 11.7, సంగారెడ్డి జిల్లా అల్మాయిపేటలో 12.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి జనవరి చివరి వారం ఉంటుందని.. ఆ తర్వాత క్రమంగా చలి తగ్గుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications