కొమ్మాల జాతరలో ఉద్రిక్తత.. పోలీస్ కాల్పుల వార్తలు, వారికి సీపీ హెచ్చరిక!
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద నేడు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొమ్మాల జాతరను పురస్కరించుకొని ప్రభ పండ్లను ప్రదర్శనగా తీసుకొని వెళుతున్న క్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభలు, కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్ల ప్రదర్శన ఉద్రిక్తతలకు కారణమైంది.
కొమ్మాల జాతరలో ఉద్రిక్తత
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరను పురస్కరించుకొనీ రాజకీయ పార్టీలు ప్రభ బండ్ల ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాయి. అయితే దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా ప్రదర్శన నిర్వహించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహబాహికి దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధర్నా
ఇక పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధర్నాకు దిగారు. అధికార పార్టీకి అండగా ఉండి, కావాలని బీఆర్ఎస్ నాయకుల పైన లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే కొమ్మాల జాతరలో పోలీసులు కాల్పులు జరిపారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో, మీడియాలో పలువురు దీనిపైన వార్తలు రాస్తున్నారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పందించారు.
పోలీసుల కాల్పుల పైన వరంగల్ సీపీ క్లారిటీ
కొమ్మాలలో జరిగిన ఘర్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించి పోలీసుల కాల్పుల పైన క్లారిటీ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో కొమ్మాల జాతర సందర్బంగా ఈ రోజు ప్రభలను తీసుకువెళ్ళే క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో పోలీసులు కాల్పులు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభబండ్ల తోపులాట ఘటనపై సీపీ చెప్పిందిదే
నేడు గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంత వ్యక్తులు మంది అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకు వెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట జరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాని ఈ సంఘటన లో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదన్నారు.
వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు
కొన్ని ప్రచార మాధ్యమాలలో ఈ సంఘటనలో కాల్పులు జరిగినట్లుగా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో వార్తలు రాసినా, సామాజిక మధ్యమాల్లో పోస్టులు పెట్టినా, వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications