మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై సర్కారు ఫోకస్.. కమిటీ ఏర్పాటు !
మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ లను సభ్యులుగా నియమించింది.
మూసీ పరిసరాల్లో అభివృద్ధి పనులు, నీటి కాలుష్య నియంత్రణ, వరద నివారణ చర్యలపై ఈ కమిటీ సమీక్ష నిర్వహించి సిఫారసులు అందించనుంది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ కల్పించి.. ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే, 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పేర్కొంది.

అంతే కాకుండా మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు, కమిటీ క్లియర్ చేసేంత వరకు ఏవిధమైన కొత్త అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా ఈ మార్గదర్శకాలను అధికారికంగా అమలు చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మూసీ పరిరక్షణకు ఎంతగానో దోహదపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications