పథకాలు ఇక వారికీ అమలు - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పని సరి కావటంతో పెద్ద సంఖ్యలో లబ్దిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు కార్డులు అందటంతో వారంతా పథకాల కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. దీంతో, ప్రభుత్వం వీరికీ పథకాలు అమలు కోసం సానుకూల నిర్ణయం తీసుకుంది.
కొత్త రేషన్‌కార్డులు పొందిన వారికి ఉచిత విద్యుత్తు, రాయితీపై గ్యాస్ సిలిండర్ తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. రేషన్ కార్డులు అందక పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రస్తుతం వారికి రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. వీరితోపాటు గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి పథకాలు పొందనివారు సైతం వాటికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు పురపాలక ఆఫీసులు, ఎంపీడీవో(మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్) కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానంగా రూ.500లకే వంటగ్యాస్, గృహజ్యోతిలో 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ లాంటి వాటికి రేషన్‌కార్డు తప్పనిసరి చేసింది. దీంతో కార్డు లేని కుటుంబాలు పథకాలకు దూరమయ్యారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది. పథకాల్లో అర్హత కోసం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మండల పరిషత్తు కార్యాలయాల్లో(ఎంపీడీవో ఆఫీస్), పట్టణాల్లోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. రాయితీ గ్యాస్ కోసం లబ్ధిదారులు తమ ఆధార్‌కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్‌లతో పాటు గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలు కౌంటర్లతో సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, మున్సిపల్ ఆఫీసుల్లో ప్రత్యేక ప్రజాపాలన కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రజాపాలన సేవాకేంద్రం నిరంతర ప్రక్రియగా అధికారులు వెల్లడించారు. .












Click it and Unblock the Notifications