మహిళల ఫ్రీ బస్సు రెండేళ్లు పూర్తి వేళ ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక నుంచి..!!
మహిళలకు ఉచిత బస్సు పథకం రెండేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెంటనే ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించింది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని స్పందన కనిపించింది. ప్రభుత్వం సైతం మహాలక్ష్మీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. కాగా, నేటితో రెండేళ్లు పూర్తి అయిన వేళ.. మహాలక్ష్మీ పథకం పైన కీలక ప్రకటన చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల క్రితం సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి.. 8459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం పైన తొలి రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చినా.. ఆ తరువాత వినియోగం భారీగా పెరిగింది. ఈ సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది.

అదే విధంగా బస్సుల్లో పథకం అమలు పైన సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలకు, ఆర్టీసీ సిబ్బందికి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బస్సులలో ప్రయాణం చేయడమే కాదు మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. కాగా, మహిళలు ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం వినియోగించుకుంటున్నారు. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశ పెడుతోంది. దీని ద్వారా ఈ కార్డులతోనే మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా కీలక మార్పు అమల్లోకి రానుంది.












Click it and Unblock the Notifications